Saturday, November 19, 2022

శ్రీశ్రీశ్రీ సనారీ విశ్వేశ్వర స్వామి చరిత్ర

           పాలకొండ గ్రామంలో నివసించే విశ్వబ్రాహ్మణ పుణ్య దంపతులు వీరాచార్య, గౌరమాంబలు పుత్రుల కోసం తపిస్తూ తీర్థయాత్రలు తిరిగి కాశీ చేరుకున్నారు అక్కడ వారు కాశీ విశ్వనాథుడ్ని ఆర్తితో, పరమ భక్తితో వేడుకోగా ఒకనాటి కలలో ఇరువురికి ఒకేసారి ఆ కాశీ విశ్వనాథుడు ప్రత్యక్షమై తానే స్వయంగా వారికి పుత్రుడై జన్మిస్తానని తన పేరునే ఆ పుత్రుడికి పెట్టమని చెప్పి అదృశ్యమయ్యాడు స్వామి.
       ఆనందంగా కళ్ళు తెరచి అక్కడనుండి తిరిగి ఇంటికి వచ్చి మహాత్ములను అతిథులను సేవిస్తూ ఉండేవారు ఆ దంపతులు .
       ఒక రోజున గౌరమాంబ నెల తప్పి గర్భవతి అయింది వైభవంగా వేడుక చేసుకున్నారు ఒక శుభదినాన 1794వ సంవత్సరం కార్తీక శుద్ధ పంచమి సోమవారం రోజున ముద్దులొలికే ఒక బాలుడు జన్మించారు ఆ దంపతులకు తర్వాత ఆ బాలుడికి విశ్వనాథచార్యులు అని పేరు పెట్టారు .
        ఆడుతూ పాడుతూ పిల్లవాడు పెరుగుతున్నాడు ఆ పిల్లవాడికి 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తల్లి గౌరమాంబ మరణించింది తర్వాత కొన్ని సంవత్సరాలకి తండ్రి కూడా మరణించడంతో పెద్ద నాన్న కుమారుడు నీలాచార్య దగ్గరకు చేరుకున్నాడు.
       అన్న నీలాచార్య, వదిన కామేశ్వరిలు విశ్వనాధుని కన్నబిడ్డ వలె చూసుకునేవారు. కానీ విశ్వనాథుడు తీవ్రమైన వైరాగ్య భావనతో జీవిస్తూ ఉండేవాడు.
        ఒకరోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి చెరువు దగ్గరకు పోయిన విశ్వనాథుడు ఆ నీటిపై తామర పుష్పాలపై ఆసీనుడైన మహా తపస్విని చూసి ఆ నీటిలో ఈదుకుంటూ వెళ్లి ఆ తపస్వి ఆశీస్సులను తీసుకున్నాడు అప్పటినుండి విశ్వనాథుడు విచిత్రంగా ప్రవర్తించేవాడు కొందరు అతడికి పిచ్చి పట్టిందనే వారు తన దగ్గరికి వచ్చే వారికి భగవంతుడి గురించి వివరించేవాడు విశ్వనాథుడు సోదరుడైన నీలాచార్యుడు తగిన కన్యను చూసి పెళ్లి చేస్తే తమ్ముడు ఒకదారికి వస్తాడని భావించి సుమంగళీపురం బ్రహ్మానందాచార్యుల కుమార్తె అన్నపూర్ణతో వివాహం జరిపించారు.
            పెళ్లయిన మూడేళ్ల తర్వాత వేరు కాపురం పెట్టి అతిధులను సేవిస్తూ ఉండేవారు అన్నపూర్ణ విశ్వనాధులు ఒకసారి వీరి ఇంటికి వందలమంది సాధువులు రాగా వారందరికీ తృప్తిగా అన్నసంతర్పణ చేసింది అన్నపూర్ణమ్మ ఒకసారి విశ్వనాధుల వారు జంగాల చెరువుకు పోయి నీటి మీద తామరాకుపరచి మధ్య భాగానికి వెళ్లి మునిగిపోయాడు .
  అక్కడున్న చాకలి వారు మరికొందరు వైశ్యులు పిచ్చి విశ్వనాథుడు అన్యాయంగా నీటిలో మునిగిపోయాడు అని బాధపడుతూ ఉండగా కాసేపటి తర్వాత నీటి అడుగు భాగం నుండి పైకి వచ్చి గట్టుమీదకు చేరుకుని రామలింగేశ్వర లింగాన్ని ఆరాధించి అక్కడ నుండి వెళ్లిపోయాడు ఆ సంఘటన చూసిన వారంతా ఆయన సామాన్యుడు కాదని గ్రహించారు అప్పటినుండి ఆయన ఉండే ఇల్లు గురుకులంలా మారిపోయింది ఎంతోమంది శిష్యులు భక్తులు విశ్వనాధుల వారికోసం వచ్చేవారు వారందరికీ ఆధ్యాత్మిక విద్యను బోధించేవారు విశ్వనాధుల వారు.
        చాకలి వ్యక్తిని చేరదీసి వేద పాండిత్యాన్ని బోధించడం వలన కుల పెద్దలు ఆ విశ్వనాథ ఆచార్యులను నీలాప నిందలకు గురి చేశారు కానీ ఆయన దేనికి భయపడలేదు .
                ఒకసారి రామలింగేశ్వర స్వామి ప్రతిష్ట జరుగుతున్నప్పుడు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు వారికి అక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా వడ్డించిన పదార్థాలు చాలక పాత్రలు ఖాళీ అయిపోయాయి ఆ సమయంగా వచ్చినవారు ఆకలితో తిరిగి వెళ్ళకూడదు అని భావించిన విశ్వనాథచార్యుల వారు తమ కమండలంలోని నీటిని పాత్రలపై చల్లగా ఆ పాత్రలని కూడా పదార్థాలతో నిండిపోయి వచ్చిన వారంతా తృప్తిగా భోజనం చేసి వెళ్లారు.
         ఒకరోజున హఠాత్తుగా విశ్వనాథ ఆచార్యుల భార్య అన్నపూర్ణమ్మ గారు గతించారు చూడటానికి ఎవరూ రాలేదు కులం వారు కన్నెత్తైనా చూడలేదు ఆ సమయంలో ఆయనే స్వయంగా తన భార్య భౌతిక దేహాన్ని దుప్పటిలో చుట్టి భుజాన వేసుకొని స్మశానంలోకి వెళ్లి శవస్తాపన చేసి ఇంటికి తిరిగి వచ్చాడు అప్పుడు అన్నపూర్ణమ్మ గారు ఆయన కంటి ముందు కనబడి ఏమండీ మీ అర్ధాంగిని నన్ను ఈ ఇంటి నుండి దూరం చేయకండి అని పలికి అదృశ్యం అయింది వెంటనే స్మశానానికి తిరిగి వెళ్లి తన భార్య భౌతిక దేహాన్ని బయటకు తీసి మరలా ఇంటికి తిరిగివచ్చి తన ఇంటిలోనే సమాధి చేశారు.
                ఒకసారి చెప్పుడు మాటలు విని తమ్ముడైన విశ్వనాథుడిని కొట్టడానికి వచ్చాడు నీలాచార్యుడు విశ్వనాథుడు కోపించి నీ నలుగురు కొడుకులు చనిపోదురు గాక అని పలికాడు అన్నట్టుగానే నలుగురు కొడుకులు మరణించారు.
           తర్వాత తన భార్య సమాధి మందిర బాధ్యతలను శిష్యుడైన వీరయ్యకు అప్పగించి దేశ సంచారం ప్రారంభించాడు విశ్వనాథ ఆచార్యులు అలా విజయనగరం చేరుకొని ఒక పర్ణశాలను నిర్మించుకొని జీవిస్తూ ఉండగా ఆనాటి విజయనగర పాలకులు విజయరామ గజపతులు విశ్వనాధ్ధాచార్యుల గురించి తెలుసుకొని స్వామివారిని రాజఆస్థాన శిల్పులకు అధ్యక్షులుగా నియమించారు శ్రీ విశ్వనాథ చార్య స్వామి వారికి జరుగుతున్న రాజ మర్యాదలను చూసిన కొందరికి కన్నుకుట్టి ఆయన కూర్చునే పీఠంపై పల్లేరు కాయలు పోయేగా అవి మల్లెపూలుగా మారిపోయాయి. 
          నిత్యం శివారాధన చేసుకునే పద్మశాలీ వంశానికి చెందిన గంట సీతప్ప శిస్తు కట్టని నేరానికి జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉండగా అతన్ని ఆశీర్వదించి చెరసాల నుండి విముక్తుడివి అవుతూ గాక అని ఆశీర్వదించిన మరుసటిరోజే అతడు చెరసాల నుండి విడుదల చేయబడ్డాడు.
            విజయనగరదీశ్వరులకు విశ్వనాథ ఆచార్యుల వారు ఎన్నో యోగ విద్యలను యోగ ప్రక్రియలను నేర్పించారు ఒకసారి విశాఖపట్నం నుండి బయలుదేరి రంపచోడవరం దగ్గర అడవిలో కాళికాదేవి ఆలయం ఎదుట కోళ్లను మేకలను బలిస్తున్న వారి వద్దకు వెళ్లి అది పాపము అని చెప్పి భూత దయకు మించిన పుణ్యము లేదని చెప్పి అక్కడున్నవారికి జ్ఞానోదయం అయ్యేలా వివరించాడు వారిలో మార్పు కలిగి అమ్మవారికి ఇకనుంచి పాలు పండ్లు నైవేద్యంగా సమర్పిస్తామని చెప్పి అందరూ ఆ క్షణం నుండి శాకాహారులుగా మారిపోయారు.
                       వెంకటరెడ్డి గారి ఇంటికి ఆతిథ్యానికి వెళ్ళినప్పుడు రెడ్డి గారి పెంపుడు చిలుక యొక్క గత జన్మ వృత్తాంతాన్ని రెడ్డి గారికి చెప్పగా ఆ చిలుక మానవాకృతిని పొందింది.
            రాత్రిపూట భయంకరంగా సంచరించే భద్రకాళి అమ్మ వారిని బండరాయిగా మార్చారు శ్రీ స్వామి వారు ఒక ఆవిడ స్వామికి ఈగలను చంపి పాలలో వేసి స్వామికి ఇవ్వగా స్వామి ఆ ఈగలను బ్రతికించి నీకు ఈగల వంటి పిల్లలే పుడతారు అని ఆమెతో పలికి అక్కడ నుండి వెళ్లిపోగా ఆమెకు ఈగ తల వంటి తల మిడిమిడి గుడ్లు లావు కడుపు సన్నటి కాళ్లు, చేతులు ఉన్న పిల్లలే పుట్టారు.
         ఒకసారి స్వామి రాగి పళ్లెంపై మూత్ర విసర్జన చేయగా అది బంగారు పళ్లెంలా మారిపోయింది తనకు వంట వండిపెట్టిన నిరుపేద రాలికి బంగారపు మొహరీల ముంతను అనుగ్రహించారు స్వామి వారు కందుకూరులోని మల్లేశ్వరాలయ పూజారులు శివాలయంలోనికి స్వామి వారిని రానివ్వకపోతే స్వయంగా పాను మట్టంతో సహా శివలింగమే బయటకు నడుచుకుంటూ వచ్చి విశ్వనాధాచార్యులతో అభిషేకం చేయించుకొని లోపలికి తిరిగి వెళ్ళిపోయింది.
           ఒకసారి జగద్గురు ఆదిశంకరాచార్యుల పీఠాధిపతులతో జరిగిన సంవాదంలో తానే సాక్షాత్తు శివుడినని నిరూపించి ఆ సంవాదంలో వారిపై గెలిచారు శ్రీ స్వామి వారు తర్వాత స్వామి వారు ఎన్నోచోట్లకు తిరుగుతూ మద్రాసు నుండి రేణిగుంట,సూల్లుర్ పేట, కడప మైదుకూరుల మీదుగా పర్యటించి కందిమల్లాయపల్లెలో ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జీవ సమాధిని దర్శించారు.
      అక్కడినుండి శ్రీశైలం వెళ్లి అక్కడే తపోసమాధిలో లీనమయ్యారు సాక్షాత్తు కాశీ విశ్వనాథుడే జనుల మధ్య సంచరించి మహిమల్ని చూపి భక్తిని మేల్కొలిపి జ్ఞానబోధ చేసి చివరకు శ్రీశైలంలో తన అవతారాన్ని ముగించిన పరమాద్భుతమైన మహాత్ముడి పాదపద్మములకు నమస్కరిస్తూ......
 సర్వేజనా సుఖినోభవంతు........ ఓం శ్రీ గురుభ్యోనమః

No comments:

Post a Comment

Demo class 7 days yoga class registration

Loading… ఫారం సబ్మిట్ చేసిన తర్వాత WhatsApp లో మమ్మల్ని సంప్రదించండి 🙏 📲 Contact on WhatsApp Your free book View ...